ఆడవాళ్లు అలంకార ప్రియులు. ఏ పండుగైనా, వేడుకైనా ముందు చూసుకునేదీ చీరలతో పాటు నగలే. బంగారం నగలు వేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇవి అందంతో పాటు అవసరానికి ఉపయోగపడుతుండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ నుండి పెరుగుతూ వచ్చిన ధరలు జనవరిలో రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారత్లో బంగారానికి ఉండే మోజు, క్రేజ్ వేరు. అందుకే బంగారం కొనుగోళ్లలో దేశం రెండవ స్థానంలో ఉంది.
కేవలం మహిళలే బంగారు ఆభరణాలపై మక్కువ చూపడం లేదు, పురుషులు సైతం వీటిని ధరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ శుభకార్యమైనా, పండగైనా బంగారు నగలు ఉండాల్సిందే. బంగారం ధరలు పెరుగుతున్నాయంటే.. ప్రతి ఒక్కరీ మొహం వెల వెలబోతూ ఉంటుంది. వీటి ధరలు తగ్గుతున్నాయంటే చాలూ షాపులు సైతం కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
వాస్తవంగా చెప్పాలంటే స్వచ్ఛమైన బంగారం మెత్తగా, సాగే గుణం ఉంటుంది. దీంతో ఇది నగగా మారే అవకాశం లేదు. దీన్ని రాగితో కలిపి ఓ వస్తువుగా తయారు చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో కూడా జిమ్మిక్కు ఉంది. 10 గ్రాముల వస్తువును తయారు చేయించుకోవాలంటే అందులో 1నుండి 2 గ్రాముల రాగి కలుస్తుంది.
రాగి ధరను కూడా బంగారం ధరతో సమానంగా లెక్కించి..మన దగ్గర నుండి వసూలు చేస్తారు. వాళ్లు తరుగు, మజూరీ అంటూ మరింత లెక్క చెప్పి మరింత నగదు దండుకుంటారు. అదేవిధంగా వజ్రాలు, ఇతర రాళ్లకు సంబంధించిన నగలు కూడా ఇదే విధంగా విలువ కడతారు. బంగారం, రాళ్లకు వేరు వేరు ధరలు చూపించాల్సి ఉన్నప్పటికీ.. రాళ్లకు కూడా బంగారం ధరే వేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలియనవి. బంగారు షాపులు యజమానులు కానీ, చిన్న చిన్నదుకాణదారులు ఇవన్నీ చెప్పరు. ఏమాత్రం అనుమానం రాకుండా కొనుగోలు దారుల నుండి డబ్బులను తమ జేబుల్లోకి నింపుకుంటున్నారు.
బంగారంలో 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, 12 క్యారెట్ ఉంటాయి. క్యారెట్ల బట్టి స్వచ్ఛతలో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే మనకు అత్యవసరమైనప్పుడు అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా 24 క్యారెట్, 22 క్యారెట్ల నగలకే విలువ కడతారు. మిగిలినవీ కేవలం అలంకరణ, అందం కోసమే. మరీ అలాంటి బంగారం చిన్నముక్కైనా విలువైనదే. ఇటీవల దుకాణాదారులు పలు బంగారం దుకాణ దారులపై దాడులు జరిగితే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
బంగారం కొనుగోలు సమయంలో దుకాణాదారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓ వస్తువు కొనుగోలు చేయాలంటే మిల్లీ గ్రామ్ కూడా విలువైనదే. ఎందుకంటే దానిపై ధరను కూడా మనకు వేస్తారు. ఇందులో జరుగుతున్న మోసాలనే కొలతలు తూనికల శాఖ అధికారులు బయట పెట్టారు.
బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వస్తున్న కస్టమర్లను ఏ మాత్రం అనుమానం రాకుండా దుకాణారులు మోసగిస్తున్నారు. మిల్లీ గ్రాముల్లో బంగారాన్ని కొట్టేస్తున్నారు. బంగారం కొలిచే తూనికలు కచ్చితమైనవి వినియోగించకపోవడం, మరికొన్నిముందుగా సెట్ చేసుకున్న మిషన్లలో వీటిని తూస్తుండటంతో మిల్లీ గ్రాముల్లో తేడా వస్తోంది. ధర మాత్రం ఎంత బంగారం చూపిస్తే అంతకే వసూలు చేస్తున్నారు. మరికొన్ని మిషన్లు పాడైపోయినప్పటికీ, వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇది అసలు ఏమాత్రం కొనుగోలు దారుడు గమనించలేడు. ఈ రకమైన మోసాలు పెద్ద షాపుల్లోనే కాదూ చిన్నపాటి దుకాణాదారులు జరుగుతున్నాయి.
అందుకే వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నగ కొనే సమయంలో తూకాన్ని ఒకటి రెండు సార్లు తనిఖీ చేయాలని, తూనికలు, కొలతలు శాఖ నుండి ఆమోదించిన తూనికలు వినియోగిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాళ్లకు, బంగారానికి వేర్వేరు ధరలను కూడా విడిగా చూపించాలి. వీటి ద్వారా కొంత వరకు మోసాల నుండి బయటపడొచ్చని చెబుతున్నారు. బంగారం మిల్లీ గ్రాముల్లో మోస పోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Leave a Reply